ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులుండేవారు. ఎప్పటికైనా లక్షాధికారులు కావాలన్నది వాళ్ళ కోరిక.
రామయ్య కష్టపడి వచ్చిన దానిలో కొంత ఖర్చు చేసి కొంత డబ్బును జాగ్రత్త చేసేవాడు. సోమయ్య మాత్రం వచ్చిన సొమ్మంతా ఖర్చు చెయ్యటమే కాకుండా లక్షాధికారి కావటం కోసం మునీశ్వరులను ఆశ్రయించేవాడు-
ఒకరోజు ఆ గ్రామానికి ఒక మునీశ్వరుడొచ్చాడు. ఆ ఊరి వాళ్ళందరూ ఆయనకి తమ కష్టాలు చెప్పుకున్నారు. వారందరికీ ఆయన మంత్రించిన తాయెత్తులను, పండ్లలను ఇచ్చి వారి కోరికలు తీరుతాయని అభయమిచ్చాడు-
రామయ్య, సోమయ్య కూడా ఆ మునీశ్వరుడిని దర్శించుకున్నారు.
రామయ్య ఆ మునీశ్వరుడికి తన మనసులో కోరికను చెప్పి అందుకు తను చేస్తున్న కృషిని చెప్పాడు.
“మంచిది. ఆ భగవంతుడు నీ కోరిక తప్పకుండా త్వరలోనే తీరుస్తాడు” అంటూ అతనికి ఓ పండును ఇచ్చాడు.
రామయ్య తర్వాత సోమయ్య ఆ మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. తన కోరికను చెప్పాడు.
“నువ్వేం కృషి చేస్తున్నావు నాయనా?" అంటూ ప్రశ్నించాడు. మునీశ్వరుడు-
“ఎప్పుడు అదే ఆలోచిస్తున్నాను స్వామి”
"కేవలం ఆలోచన వల్ల ఫలితం కలుగదు నాయనా, ఆలోచనలను ఆచరణలో పెట్టగలగాలి.”
స్వామీ తమరు చెప్పింది నిజమే కానీ నా సంపాదన నా కుటుంబానికి తింటానికే సరిపోదు. ఈ సంపాదనతో నా జీవిత కాలంలో నేను లక్షాధికారిని కాలేను. కనుక నేను లక్షాధికారిని అయ్యేందుకు నాకేదన్నా మంత్రం ఉపదేశించండి" అంటూ సోమయ్య మునీశ్వరుడిని ప్రాధేయపడ్డాడు.
ముని నవ్వి “సోమయ్య అయాచితంగా దక్కేది ఏదీ ఆనందాన్ని ఇవ్వదు. కష్టపడి సాధించుకొనేది ఆనందాన్ని ఇస్తుంది” అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు. కానీ సోమయ్య మంత్రం ఉపదేశించమని ప్రాధేయపడటంతో 'సరే ఉపదేశిస్తాను' అంటూ ఇలా చెప్పాడు.
"సోమయ్య నేను ఉపదేశించే ఈ మంత్రం నీవు ఎప్పుడైనా సరే ఒక్కసారి పఠించటానికే ఉపయోగపడుతుంది. నువ్వు ఎంత ధనం కోరుకున్నా వస్తుంది. కానీ నువ్వు ఆ ధనాన్ని వెంటనే ఖర్చు చెయ్యకూడదు. కనీసం నెల రోజులన్నా ఓపిక పట్టాలి. ఈ లోపు ఆ ధనంలో ఒక్క రూపాయి ఖర్చు చేసినా మిగిలిన ధనం మొత్తం మాయమయిపోతుంది” అంటూ సోమయ్య చెవిలో మంత్రోపదేశం చేసాడు.
సోమయ్య ఆనందంగా ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి “ఈ విషయం ఎవ్వరికి చెప్పకు” అంటూ ఆ రాత్రే మునీశ్వరుడు చెప్పిన మంత్రం పఠించి కోటి వరహాలు కోరుకున్నాడు. మరుక్షణం అతడి నట్టింట్లో కోటి వరహాల వర్షం కురిసింది -
ఆ ధనాన్నంతా గోనెసంచుల్లోకి ఎత్తి పాతసామాన్లు ఉంచే గదిలో భద్రపరిచాడు. కానీ ఆ ధనంలోంచి భర్త చూడకుండా కొన్ని వరహాలను తీసి చీరకొంగుకు కట్టుకుంది సోమయ్య భార్య.
ఆ వరహాలు బంగారు వరహాలు వాటితో ఆభరణాలు చేయించుకోవాలని ఆమె అనుకుంది-
తను లక్షాధికారికాక కోటీశ్వరుడు అయ్యాడన్న ఆనందాన్ని పట్టలేక ఆ రాత్రి సోమయ్యకు నిద్దర పట్టలేదు. ఆ ధనంతో ఏమేం కొనుక్కోవాలో ఆలోచిస్తూ రాత్రంతా మేలుకున్నాడు-
మర్నాడు ఉదయం సోమయ్య భార్యకు జాగ్రత్తలు చెప్పి రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న ముదుసలులు పొలంకి దమ్ము చేసే సమయంలో అక్కడకి వెళ్ళకుండా ఇక్కడ కొచ్చావేం? అనడిగితే “మా దూరపు చుట్టం ఒకామె చనిపోయింది. ఆమె బాగా ధనవంతురాలు. కోటి వరహాలకు పైగా కూడ బెట్టింది. ఆ ఆస్తి మొత్తం నాకు కలిసి రాబోతోంది ఇక నేను వ్యవసాయం చెయ్యను. పాలేరుల్తో చేయిస్తాను” అంటూ వాళ్ళందరికి డాబుగా చెప్పాడు-
ఆ సాయంత్రానికల్లా ఆ విషయం ఊరంతా పాకిపోయింది -
ఆ రోజు నుండి ఆ ఊరిలో సోమయ్య దర్జానే మారిపోయింది -
రెక్కాడితే గానీ డొక్కాడని సోమయ్యకు అంతకు ముందు అప్పులు ఇవ్వనివారు కూడా అడిగిందే తడువు ధనం సర్దుబాటు చెయ్యసాగారు.
36
37
నెల రోజల తర్వాత ఎటూ తను కోటీశ్వరుడు కనుక వారి అప్పు తీర్చడం తనకి సమస్య కాదని ఇచ్చిన వారి దగ్గరల్లా పుచ్చుకుంటూ విందు, వినోదాలతో కాలం గడపసాగాడు సోమయ్య-
ఇరవై రోజులు గడిచాయి-
మునీశ్వరుడు చెప్పిన గడువుకి పది రోజులు ముందుగానే సోమయ్య భార్య కంసాలిని పిల్చి భర్త ఊరివారందరికి చెప్పినట్లే కలిసొచ్చిన ఆస్తిలోనివని చెప్పి ఆ బంగారు వరహాలతో ఆభరణాలు చెయ్యమని చెప్పి ఇచ్చింది -
మరుక్షణం
గోనెల్లో వరహాలన్ని మాయం అయిపోయాయి.
ఆ రాత్రి ఇంటికి వచ్చిన సోమయ్య జరిగింది తెలుసుకుని లబోదిబో మన్నాడు. ఈ విషయం ఊరిలో వారికి తెలిస్తే తన పరువు దక్కదని రాత్రే భార్యాపిల్లల్తో ఊరుదాటి వెళ్ళిపోయాడు-
పేరాశ కలిగిన వాడిని అదృష్టం కూడా వెక్కిరిస్తుంది. దురదృష్టం ఏదో ఒక రూపంలో అక్కున చేర్చుకుంటుంది. అందుకనే ఏదన్నా సాధించాలనుకుంటే దానికి తగ్గ కృషి చెయ్యాలిగానీ అడ్డదారుల్లో దానిని చేరుదామని ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా భంగపాటు తప్పదు