అనగనగా ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. పాపం ఆమెకి వెనకా ముందు ఎవ్వరూ లేరు-
ఒకనాడు ఆమె మొక్కలకు పాదులు చేస్తుంటే మట్టిలో ఆమెకి ఓ విలువైన వజ్రాలహారం దొరికింది -
కాటికి కాళ్ళు చాపుకున్న వయసులో ఆ వజ్రాలహారం తనకెందుకని ఆ ముసలమ్మ ఆ హారాన్ని తీసుకుపోయి ఆ ఊరి గ్రామదేవత మెడలో వేసి చక్కా ఇంటికి వచ్చేసింది -
ముసలమ్మ వజ్రాలహారాన్ని గ్రామదేవత మెడలో వేయటం చూసిన ఒక దొంగ ఆమె అటు వెళ్ళగానే దాన్ని దొంగిలించి తీసుకుపోయి ఒక వజ్రాల వర్తకుడికి అమ్మేసాడు -
ఆ హారం కొన్న వర్తకుడు అది ఎంతో విలువైనదని దాన్ని తీసుకుపోయి రాణిగారికి అమ్మ చూపితే అది లాభసాటి బేరం అవుతుందని అప్పటికప్పుడు ఆ హారం తీసుకొని రాచ నగరుకు బయలు దేరాడు -
వర్తకుడికి దారిలో ఓ దొంగల గుంపు తారసపడింది -
దొంగలనాయకుడు వర్తకుడ్ని చంపి హారాన్ని తస్కరించుకు పోయి తన భార్యకు బహుమానంగా ఇచ్చాడు.
అది ధరించి ఆమె స్థావరంలోని మిగతా ఆడంగులందరికీ ప్రదర్శించి చూపి ఆనందించింది-
ఒక దొంగ భార్యకు ఆ హారాన్ని చూసి కన్ను కుట్టింది. ఆ హారం ఎలాగయినా తన సొంతం చెయ్యమని భర్తను బ్రతి మాలింది. ఆ హారం దొంగిలిస్తే ఇక జన్మలో దొంగల నాయకుడికి కన్పించనంత దూరంగా పోయి బ్రతకాల్సి ఉంటుందని ఆమెను హెచ్చరించాడు-
అందుకు సరే నందామె
ఆ రాత్రే దొంగల నాయకుడి భార్యను చంపి ఆ హారం దొంగిలించి ఇద్దరూ గుర్రాలపై దూరంగా పారిపోతూ అడవి దారిలో పులివాత పడి చనిపోయారు.
ఆ వజ్రాల హారంలోని వజ్రాలను చూసి మాంసం ముక్కలని భ్రమించి వారిద్దరిని చంపిందా పులి. కానీ ఎంత కొరికినా మాంసం రాకపోవటంతో ఆ శవాల ప్రక్కనే ఆ హారం వదిలేసి పోయింది-
ఆ దారిలో వచ్చిన ఒక బాటసారి ఆ శవాలను, హారాన్ని చూసి ఆ రెండు శవాలను ఒక ప్రక్కగా పూడ్చి పెట్టి హారాన్ని పట్టుకుపోయి భార్యకు ఇచ్చి భద్రపరచమని చెప్పాడు -
కొద్ది కాలానికి అతని భార్యకు బాగా జబ్బు చేసి వైద్యానికి డబ్బు అవసరమయ్యి దానిని ఒక వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి రొక్కం పుచ్చుకున్నాడు. కానీ ఎంత వైద్యం చేయించినా అతని భార్య మరణించింది.
కొన్నాళ్ళకి ఆ వడ్డీ వ్యాపారి ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగి అతను కట్టుబట్టల్తో మిగిలాడు. ఆ బాధ తట్టుకోలేక అతడు మరణించాడు-
ఆ వ్యాపారి ఇల్లు తగలబడుతున్నప్పుడు సాయం చేద్దామని వచ్చిన వారిలో ఒక యువకుడికి దొరికింది ఆ వజ్రాలహారం. అతడు దాన్ని తీసుకు వెళ్ళి తనకు తెలిసిన కంసాలికి ఇచ్చి అందులో రాళ్ళను వేరు చేసి బంగారాన్ని కరిగించి వేరే ఆభరణం చెయ్యమన్నాడు. కంసాలి సరేనన్నాడు-
కంసాలి దగ్గర నుండి పొద్దు పోయాక తిరిగి వస్తున్న ఆ యువకుడిని ఒక పాము కాటు వెయ్యటంతో అతడు మరణించాడు-
ఆ యువకుడు చనిపోవటంతో కంసాలికి దుర్భుద్ధి పుట్టి ఆ వజ్రాల హారాన్ని పొరుగూరిలో ఉన్న తన కూతురికి కానుకగా నమ్మకస్థుడైన ఓ పనివాడికి ఇచ్చి పంపాడు.
ఆ రాత్రే ఆ కంసాలి పాముకాటుకు మరణించాడు-
కంసాలి కూతురికి పంపుతున్న పొట్లంలో ఏ ముందో చూద్దామని విప్పిన ఆ నమ్మకస్థుడికి ధగ, ధగ మెరిసే వజ్రాల హారాన్ని చూడగానే కన్నుకుట్టి దాన్ని సొంతం చేసుకుని అమ్ముకోవాలన్న దుర్భుద్ధి పుట్టి దారి మార్చి పట్నం వైపు ప్రయాణమయ్యాడు-
పట్నం దారిలోనే ఉంది మొదట ఆ వజ్రాలహారం దొరికిన ముసలమ్మ గ్రామం. వాడు ఆ గ్రామం చేరుకునే సరికి రాత్రి పొద్దు అయ్యింది. ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయం తిరిగి బయలు దేరుదామనుకుని ఆ రాత్రి ఆశ్రయం పొందటానికి తగిన ఇంటి కోసం వెతుక్కుంటూ నడుస్తుండగా వాడికి ముసలమ్మ ఇల్లు కన్పించింది. సరాసరి ఆ ఇంటి ముందుకు వచ్చి ఆమెను ఆశ్రయం ఇమ్మని అడిగాడు-
దయగల ఆ ముసలమ్మ అందుకు అంగీకరించింది-
ఆశ్రయంతో పాటు వాడికి ఆతిథ్యం కూడా ఇచ్చింది -
ఆ రాత్రి అతడు వజ్రాలహారం అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ విధంగా ఖుషీ చేస్తూ గడపాలో కలలుకంటూ నిద్దర్లోకి జారుకున్నాడు -
మర్నాడు ఉదయం అతడు నిద్దురలేచే సరికి బారెడు పొద్దెక్కిందికాలకృత్యాలు తీర్చుకుని ముసలమ్మకు కృతజ్ఞతలు చెప్పి పట్నం కేసి బయలుదేరాడు అతను -
సరిగ్గా ఆ గ్రామదేవత గుడి ముందుకు వచ్చేసరికి ఎటునుంచి వచ్చిందో కానీ పలుపు తెంచుకున్న ఓ పోట్లగిత్త వెనుక నుండి యమపాశంలా దూసుకు వచ్చి తన వాడియైన కొమ్ములొ అతన్ని పొడవటంతో మరణించాడు -
ఆ దృశ్యం చూసిన గ్రామస్థులకి అతని ప్రక్కనున్న వజ్రాలహారం ఆకర్షించింది. దాన్ని అందరూ కలిసి చర్చించుకుని ఆ ఊరి గ్రామదేవతకు సమర్పించి దొంగలు ఎత్తుకుపోకుండా ఆ గుడిని కట్టుదిట్టం చేసారు -
ఇంతకీ ఆ చనిపోయిన వాడు ఎవరో తెలుసా? అంతకు ముందు ఆ గ్రామదేవత మెడలోంచి వజ్రాలహారం దొంగిలించిన వాడే. రాత్రి పూట రాజ భటుల గస్తీ ఎక్కువ కావటంతో దొంగతనాలు మాని ఆ కంసాలి దగ్గర పనికి కుదిరాడు-
దుర్భుద్ధితో ఎవ్వరు ఏ పని తలపెట్టినా అది ప్రాణాలకు ముప్పు కల్గిస్తుంది. ఇతరుల వస్తువులను సొంతం చేసుకోవాలనుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సిందే.