పూర్వం ఒక ఋషి దగ్గర ఒక మాయా తివాచి ఉండేది. దాని మీద ఆయన ప్రతిరోజు హిమాలయ పర్వతముల నుండి కాశీకి వెళ్ళి శివుడిని దర్శించుకుని తిరిగి హిమాలయ ప్రాంతంలో ఉన్న తన ఆశ్రమానికి క్షణాల్లో చేరేవాడు-
ఆ మాయా తివాచిని ఆయనకు బ్రహ్మదేవుడు వరంగా ఇచ్చాడుఒక వేకువ ఝామున ఆయన కాశీకి వెడుతున్న సమయంలో ఒక
దొంగ తివాచీని దాని మీద కూర్చుని ధ్యానంలో ఉన్న ఋషిని చూసాడు ఆ విధంగా వరుసగా నాలుగయిదు రోజులు చూసిన తర్వాత వాడికి ఆ తివాచీ గొప్పతనం అర్థమయ్యి ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన కల్గింది–
ఆ రోజు నుండి ఆ తివాచి ఏ దిక్కు నుండి బయలు దేరివస్తోందో గమనించి ఆ దిక్కుకు ప్రయాణం ప్రారంభించాడు-
ఆ తివాచీని సొంతం చేసుకుంటే క్షణాల్లో సుదూర రాజ్యాలకు వెళ్ళి దొంగతనాలు చేసుకురావచ్చు అన్నదే వాడి పన్నాగం -
కొన్ని మాసాలు తివాచీ వస్తున్న దిశను గమనించుకుంటూ
హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఋషి ఆశ్రమాన్ని చేరుకున్నాడు- ఋషి వాడ్ని చూసి “ఎవరు నాయనా నువ్వు?” అంటూ ప్రశ్నించాడు-
"స్వామీ! నేనొక దేశ దిమ్మరిని దేవుడ్ని వెతుక్కుంటూ బయలుదేరాను” అంటూ అమాయకంగా మొహం పెట్టి నమ్మకంగా చెప్పాడు.
"అలాగా! అయితే దేవుడు కన్పించాడా?”
"లేదు... కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దేవుడు మీరేననిపిస్తోంది. మీరు దయతలిస్తే మీ శిష్యుడిగా చేరి పాద సేవ చేసుకుంటా” నంటూ అతి వినయం నటిస్తూ ఋషి కాళ్ళ మీద పడ్డాడు-
ఆ ఋషి ఆ దొంగను శిష్యుడిగా అంగీకరించాడుకొన్నాళ్ళ పాటు ఆ దొంగ నమ్మకంగానే ఉన్నాడు-
ప్రతిరోజు ఆ తివాచీ మీద ఋషి కొంతసేపు ఎక్కడికో వెళ్ళి రావటం గమనించి ఆ విషయం అడిగాడు.
తను ప్రతిరోజు కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళి వస్తున్నానని చెప్పాడు ఆ ఋషి. వెంటనే తనకి కూడా కాశీనాథుని దర్శనం చేసుకోవాలని ఉందని చెప్పాడు దొంగ-
"అయ్యో! ఆ తివాచీ మీద ఒక్కరు తప్ప ఇద్దరు వెళ్ళటం కుదరదు నాయనా” అని ఋషి చెప్పటంతో వాడు నిరుత్సాహం పడ్డాడు.
ఋషి ఒప్పుకుని ఉంటే దారిలో ఆ మాయా తివాచీ గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత ఋషిని పై నుంచి క్రిందకు తోసేసి దాన్ని సొంతం చేసుకుందామని వాడి ఆలోచన -
ఋషికి దొంగ మొహంలో నిరుత్సాహం మరొక రకంగా అన్పించింది
“ఏం నాయనా!” అంటూ అనునయంగా అడిగాడు-
“ఏం లేదు స్వామీ నా జీవితంలో ఒక్కసారన్నా ఆ కాశీ నాథుడిని
దర్శిస్తాననుకున్నా. కానీ ఆ నమ్మకం పోయింది" అంటూ బాధ నటించాడు. ఋషికి వాడి మీద జాలి కల్గింది-
“సరే... రేపు నా బదులు నువ్వెళ్ళి ఆ స్వామిని దర్శించుకురా” అంటూ ఆ మాయా తివాచీని నడిపించే మంత్రం వాడికి చెప్పాడు.
"స్వామీ! మీరు అనుమతిస్తే ఈ క్షణమే వెళ్ళి ఒక నిద్ర చేసి ఆ స్వామిని తొలి దర్శనం చేసుకు" వస్తానన్నాడు దొంగ-
పాపం! ఋషి సరేనన్నాడు-
ఆ క్షణమే తివాచీతో దొంగ ఉడాయించాడు-
ఆ తర్వాత వాడు ఆ తివాచీ సాయంతో అనేక దొంగతనాలు చేసి తను ఉంటున్నచోట గొప్ప ధనవంతుడిలా చెలామణి కాసాగాడుకొన్నాళ్ళకి పొరుగు రాజ్యంలో వాడు దొంగతనం చేస్తూ పట్టుబడి మొదట్నుంచి జరిగిన కథంతా ఆ రాజు ఎదుట చెప్పాడు.
రాజు ఆ ఋషిని బంధించి తెమ్మని భటులను పంపాడుభటులు ఋషిని పట్టి తెచ్చారు -
తననెందుకు బంధించారని ఋషి రాజును ప్రశ్నించటంతో రాజు ఆయనకి ఈ విధంగా చెప్పాడు-
"అయ్యా! తమరు గొప్ప తపశ్శక్తిశాలులు. బ్రహ్మ దగ్గర్నుండి ఈ మాయా తివాచీని వరంగా పొందినవారు. అటువంటి మీరు ఒక దొంగను చేరదీసారు. మీ సాంగత్యంలో కూడా వాడు మాయా తివాచీని పొందాలన్న దుర్భుద్ధిని వీడలేకపోయాడు. బిడ్డ తప్పు చేస్తే తల్లినీ, తండ్రినీ ప్రజలు తప్పు చేస్తే రాజునీ, శిష్యులు తప్పు చేస్తే గురువునీ శిక్షించటం నాకు తెలిసిన ధర్మం. అందుకనే మిమ్మల్ని బంధించి తెమ్మన్నాను. అంతకంటే ముఖ్యంగా అపాత్రదానం చేసారు మీరు” ఆ మాటలు విన్న ఋషి రాజుతో ఈ విధంగా చెప్పాడు.
“రాజా! నీవన్నది నిజమే. శిష్యుడు తప్పు చేస్తే గురువును దండించాలి.
కానీ నేను అపాత్ర దానం చేసినందుకు శిక్షార్హుడిని కాదు. ఎందుకంటే ఆ మాయా తివాచీని నేను శాశ్వతంగా నా శిష్యుడైన ఈ దొంగకి ఇవ్వలేదు.
ఆ కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకురావటానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చాను. నేను రాగద్వేషాలను జయించినవాడిని. నాకు దొంగలోనూ భగవత్ స్వరూపమే కనపడింది. అయినా జరిగిన తప్పుకు నేనూ కొంత బాధ్యుడినే కనుక నీవు ఆచరిస్తున్న న్యాయం ప్రకారం ఆ దొంగతో పాటు నన్ను కూడా శిక్షించు.”
ఋషి మాటలు పూర్తికాకుండానే ఆయనపై దేవతలు పూలవాన కురిపించారు. ఇంద్రుడు ఆయన్ని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి పుష్పక విమానం పంపాడు-
రాజు ఆ దొంగను ఆజన్మాంతం చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించాడు-
ఎదుటివారు చేసే తప్పుకు సహకరించటమూ తప్పే అని తెలుసుకున్న వాడే నిజమైన ఋషి.