జమిందారు పథకం | Moral Stories in Telugu

తిమ్మాపురం జమిందారు రావుబహుదూర్ నరిసింహరాయలుగారు. తరతరాలు తిన్నా తరగని ఆస్తికి ఆయన వారసుడు.


జమిందారుగారి దివాణంలో ఎన్నో విలువైన ఆభరణాలు ఉండేవి. అన్నింటి కంటే ఆయన పూజా గదిలో వజ్రాలు పొదిగిన లక్ష్మీదేవి విగ్రహం ఎంతో పురాతనమైనది, విలువైనది.


ఈ సమాచారం ఓ దొంగల నాయకుడికి తెలిసింది.


ఆ విగ్రహాన్ని ఎలాగైనా దొంగిలించి వజ్రాల వర్తకులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నాడు.


ఆ నాయకుడు మిగిలిన దొంగల్తో చర్చించి ఒక పథకం రూపొందించాడు. దాని ప్రకారం ముందుగా ఇద్దరు దొంగలు మారువేషాల్లో వెళ్ళి జమిందారుగారి మేడలో తోట పనికి, గొడ్లు పనికి కుదిరి కొద్ది రోజులు పని చేసి ఆ ఇంటి ఆనుపాలు తెలుసుకుని రావటానికి వెళ్ళారు -


అనుకున్నట్లే ఆ దొంగలిద్దరూ పనికి కుదిరి కొద్ది రోజులు పని చేసి ఆ ఇంటి ఆనుపాలను తెలుసుకు వచ్చారు. అన్ని విషయాలు దొంగల నాయకుడికి చెప్పారు. అంతా విన్నాక దొంగతనానికి ముహూర్తం నిశ్చయించాడు-


అర్ధరాత్రి సమయంలో జమిందారుగారి మేడలోకి ప్రవేశించారు. దొంగలందరూ. అందరూ తలో ప్రక్కకు వెతుకుతూ వెళ్ళగా దొంగల నాయకుడు తిన్నగా పూజగది వైపు బయలు దేరాడు.


ఆ క్షణంలోనే బంగ్లాలో దీపాలు వెలిగాయి-


చుట్టూ చూసిన దొంగలకి గుండె ఆగినంతపనయ్యింది -


వస్తాదుల్లాంటి జమిందారు మనుషులు ఓ పాతిక మంది పైనే చుట్టూరా కర్రలు పట్టుకు నిల్చుని ఉన్నారు.


జమిందారు ముందుకు వచ్చి ఆ దొంగల నాయకుడికిలా చెప్పాడు “మీ వాళ్ళిద్దరూ నా దగ్గర పనికి రాగానే వాళ్ళు దొంగలని గ్రహించాను. అయినా వాళ్ళ గుట్టు తెలుసుకుందామనే పనిచ్చి వాళ్ళ


మీద వేగుల్ని నియమించాను. వాళ్ళిద్దరూ పని దొంగలని ఏదో ఆశించే ఇక్కడ చేరారని మా వేగులు చెప్పారు.


అప్పట్నుంచి వాళ్ళని మరింత జాగ్రత్తగా గమనించమన్నాను. ఆక్రమంలోనే మా వేగులు వెంబడించి మీరు తలదాచుకున్న స్థావరాన్ని కూడా కనుక్కున్నారు.


ఈ రోజు నుంచి ఈ చుట్టు ప్రక్కల వారికి మీ పీడా వదిలిపోవటమే కాదు. ఇన్నాళ్ళూ మీరు దోచుకుని దాచుకున్న సొత్తుతో ప్రతి గ్రామంలోను ఓ ధర్మసత్రం కట్టిస్తాను” అంటూ తన మనుషులకు సైగ చేసాడు దొంగలను బంధించమని-


ఆనాటి నుంచి తిమ్మాపురం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు కూడా ఆ దొంగల పీడా వదిలిపోవటమే కాక దొంగ సొత్తుతో జమిందారు అన్నట్లుగానే ప్రతి గ్రామంలో ఓ ధర్మసత్రం కట్టివ్వటంతో అవి ఎంతో మందికి ఆశ్రయం ఇవ్వసాగాయి.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్