ఒక అడవిలో ఒక గజరాజు, ఒక సింహం ఉండేవి -
గజరాజు సాధుజంతువుల పక్షాన ఉండి కూౄర జంతువుల నుండి సాధు జంతువులను రక్షిస్తూ ఉండేది-
సింహం కూౄర జంతువులకు రాజుగా ఉండి వాటి పక్షాన గజరాజుతో పోరాడుతూండేది -
ఈ రెండూ రెండు పక్షాలకు కొమ్ము కాస్తుండటం వల్ల ఆ రెండింటి మధ్యన ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది.
ఒకనాడు ఓ కుందేలు పుట్టినరోజు వచ్చింది. అది తోటి సాధు జంతువులందర్ని విందుకు పిలిచి గజరాజును ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది.
ఈ సమాచారం ఓ గుంట నక్కకు తెలిసింది-
అది అప్పటికప్పుడు కూరజంతువుల్తో ఓ సమావేశం ఏర్పాటు చేసి “మనం ఈ రోజు వింధుభోజనం చేద్దాం. సాధుజంతువలన్నీ ఒకేచోట చేరి విందు వినోదాలలో మునిగి తేలుతున్నాయి. మనం అకస్మాత్తుగా వాటి మీద దాడి చేస్తే రకరకాల రుచులు కలిగిన మాంసాన్ని ఒకేసారి రుచి చూడొచ్చు” అంటూ మిగతా జంతువులకు నోరూరేలా వర్ణించి, వర్ణించి చెప్పింది-
అన్ని సరేనన్నాయి-
అయితే మనం మన మృగరాజు మద్దతుకోరదాం. ఆయన మద్దతు లేకపోతే ఆ గజరాజు ముందు మన ఆటలు సాగవు అంది-
అందుకు అన్నీ సరేననటంతో అప్పటికప్పుడు కూరజంతువులన్నీ బయలుదేరి మృగరాజు దగ్గరకు వెళ్ళి తమ ఆలోచనను చెప్పి అందుకు మద్దతును ఇవ్వవలసిందిగా ప్రాధేయపడ్డాయి-
“సరే” నన్నాడు మృగరాజు –
ఈ తంతు మొత్తం ఓ చిట్టి కుందేలు వింది-
అది వేగంగా పోయి ఆ సంగతంతా తమవాళ్ళకి తెలియచేసింది సాధుజంతువులన్నీ కలిసి కూౄర జంతువులకు తగిన గుణపాఠం చెప్పటానికి ఒక గొప్ప పధకం తయారు చేసాయి.
అడవిలో ఒకచోట అన్నీ కలసి ఒక పెద్ద గుంటను తవ్వి దాని మీద పుల్లలను పేర్చి ఆకులు కప్పాయి.
చెబితేగానీ అక్కడ గుంట ఉందన్న విషయం తెలియకుండా చేసాయిఒక ప్రక్కన అవి విందులో కాలక్షేపం చేస్తున్నట్లు నటించసాగాయి. కొన్ని కోతులు మాత్రం నాలుగు ప్రక్కల ఉన్న ఎత్తైన చెట్ల గుబురుల్లో దాక్కుని కూర జంతువులు ఎటు నుండి వస్తున్నాయో గమనించసాగాయి. కొంత సమయం గడిచింది-
ఓ దిక్కు నుండి చప్పుడు కాకుండా వస్తున్న కూౄర జంతువులను గమనించిన ఒక కోతి గబ గబా వచ్చి సాధు జంతువులకు విషయం చెప్పింది.
సాధుజంతువులన్నీ కూడబలుక్కుని గుంటకు అవతల ప్రక్కకు వెళ్ళి కేరింతలు కొడుతూ కాలక్షేపం చెయ్యసాగాయి-
గుంటకు ఇవతల ప్రక్కనున్న పొదల వరకు చప్పుడు కాకుండా నెమ్మదిగా వచ్చిన కూరజంతువులు అక్కడకు రాగానే ఒక్కసారి వేగంగా ముందుకు దూకాయి -
పాపం ముందున్నది ఆకులు కప్పిన గుంటని వాటికి తెలియలేదు. అది తెలిసే సరికి ఎండుపుల్లలు పెళ, పెళ మంటూ విరిగి గుంటలో పడిపోయాయి-
సాధుజంతువులన్నీ ఆ ఆ గుంట చుట్టూ చేరి కేరింతలు కొట్టసాగాయిజరిగిన మోసం అప్పటికి అర్థమైంది కూరజంతువులకి-
"మృగరాజా! తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు. ఈ గుంట నక్క మాటలు వింటే నీకిలాంటి గతే పడుతుంది" అంటూ గజరాజు హెచ్చరించింది-
ఆ రాత్రంతా పాపం కూౄర జంతువులు ఒకదానికొకటి సాయం చేసుకుని ఎలాగోలా గుంటలోంచి బయటపడ్డాయి. ఆఖరుగా గుంటలో నక్క మాత్రం మిగిలి పోయింది -
"మృగరాజా! నేనింకా గుంటలోనే ఉన్నాను. బయటకు రావటానికి కాస్తంత సాయం చెయ్యండి" అంటూ అరిచిందది.
“అసలు... ఇంత అవమానం నీ వల్లే. ఎప్పుడూ ఏదో ఒక చచ్చు సలహాలను ఇచ్చి ఇలా తంటాలు తెచ్చి పెడుతున్నావు కనుక నువ్వు ఈ
గుంటలోనే పడిచావు" అంటూ నక్కను అలానే గుంటలో వదిలేసి కూర
జంతువులు తమ ఇంటిదారి పట్టాయి - పాపం! ఆ రాత్రంతా నక్క ఏడుస్తూనే ఉంది- మర్నాడు ఉదయం అక్కడకు వచ్చిన గజరాజు దాని మీద దయతలచి తన తొండంతో ఎత్తి దాన్ని బయటపడేసి ఈ విధంగా చెప్పాడు-
"మిత్రమా! మాంసాహారం భుజించటం మీ జాతి లక్షణం. శాఖాహారం భుజించటం మాజాతి లక్షణం. ఆకలితో నువ్వు వేటాడటం నీ జాతి ధర్మం. అది మరచి కన్పించిన సాధు జంతువు నల్లా వేటాడుతూపోతే కొన్నాళ్ళకి ఈ అడవిలో నీకు తింటానికి ఒక్క సాధు జంతువు కూడా దొరకదు.
దేవుడు మీకు ఆహారంగానే మమ్మల్ని సృష్టించలేదు. మా వల్ల ఈ లోకానికి జరగాల్సిన మేలు ఎంతో ఉంది" ఆ మాటలు విన్న నక్క తన తప్పు క్షమించమని ఆ గజరాజును వేడుకుంది -
ఆ తరువాత కాలంలో నక్క మళ్ళీ ఎప్పుడూ అలాంటి బుద్ధి తక్కువ పనిని చెయ్యనేలేదు-