రామాపురంలో సీతయ్య అనే గొప్ప ధనవంతుడుండేవాడు. అతడు పరమలోభి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలనంత నిర్దయుడుఆ ఊరి వారందరికి డబ్బు అవసరమయినపుడు సర్దుబాటు చేసి ఎక్కువ వడ్డీ గుంజుకునేవాడు సీతయ్య-
రామయ్య సీతయ్య పొరిగింటివాడు-
అన్నింటిలోనూ రామయ్య సీతయ్య కంటే తక్కువవాడే. కానీ సుగుణాలలో మాత్రం అతడి కంటే ఎంతో ఎత్తులో ఉండేవాడు. తన సంపాదనను పొదుపుగా వాడుకుంటూ కొంత ధనాన్ని దానధర్మాలకు వినియోగించేవాడు -
సీతయ్య అవకాశం చిక్కినప్పుడల్లా "నీ ఇంటి మీద తాటాకులు కూడా సరిగ్గా లేవు. ముందు వాటిని కప్పించుకో ఆ తర్వాత దానధర్మాలు చేద్దువుగానివి” అంటూ ఎగతాళి చేసేవాడు-
సీతయ్య మాటలకు రామయ్య నవ్వి ఊరుకునేవాడు- ఒకనాడు సీతయ్య కూతురి పెండ్లి నిశ్చయమైంది. పెండ్లి పనులకు హెచ్చు కూలీ ఇస్తే కానీ ఎవ్వరూ రాలేదు. రామయ్య అతని భార్యా మాత్రం వచ్చి తమకి చేతనయినంత సాయం చేసారు-
కొన్నాళ్ళకి రామయ్య కూతురి పెండ్లి నిశ్చయమైంది. ఊరి జనమంతా తమ ఇంట్లో పెళ్ళి అన్నంత హడావిడి చేసి రామయ్యను, అతని భార్యను ఏ పని ముట్టుకోనీకుండా తామే దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టారు. అంతేకాక ఒక్క వస్తువును కూడా రామయ్యను కొననీయకుండా తలొకరూ తలొక వస్తువును పట్టుకొచ్చి మరీ పెళ్ళి తంతు జరిపించారు -
సీతయ్య కూతురి పెండ్లి కంటే రామయ్య కూతురి పెండ్లే ఆడంబరంగా జరిగింది -
ఈ తంతు చూసిన సీతయ్య ఇలా అనుకున్నాడు -
“నేను రామయ్యకంటే ధనవంతుడిని కానీ నాకు అవసరమన్నప్పుడు ఊరి జనాలు మొహం చాటు చేసారు. బీదవాడైనా రామయ్యకు అవసరం అయ్యేసరికి అందరూ కలిసి వచ్చి అతడికి సాయం చేసారు. నిజంగా నేను రామయ్యకంటే ధనంలో గొప్పవాడినయినా గుణంలో బీదవాడిని”
ఆనాటి నుండి సీతయ్య కూడా రామయ్యలా అవసరమయినప్పుడల్లా ఊరివారికి ఉపకారం చేస్తూ త్వరలోనే వారందరి అభిమానం సంపాదించు కున్నాడు
ఇతరులు మనకి సాయం చెయ్యలేదు అనుకునే ముందు ఇతరులకు మనం ఏం సాయం చేసాం అని ఆలోచించుకోవాలి. ధనంలో గొప్పవాడైన వాడి కంటే గుణంలో గొప్పవాడే అందరికి ఎప్పుడూ అభిమానపాత్రుడు, ఆదర్శవంతుడు అవుతాడు-