పూర్వం గంగా తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో కూౄర జంతువుల్తో పాటు సాధు జంతువులు కూడా నివసిస్తుండేవి. గంగా తీరంలో ఒక మునీశ్వరుడు ఆశ్రమం నిర్మించుకొని రాజ కుమారులకు విద్య నేర్పిస్తుండేవాడు.
ఆయన గొప్ప మహిమలు కల వాడని ఆ చుట్టు ప్రక్కల ప్రజలకు విశ్వాసం కుదిరింది. అందువల్ల తమకి ఏ కష్టం వచ్చినా అడవి దాటి వచ్చి ఆయనకి తమ కష్టం చెప్పుకునేవారు. వారికి తగిన సలహాలను ఇచ్చి ఆ ముని ఓదార్చేవాడు. ఆ అడవిలోకి ఉన్నట్టుండి ఒకనాడు ఇద్దరు రాక్షసులు చేరారు. వాళ్ళిద్దరూ అన్నా తమ్ములు.
ఆ రాక్షసులిద్దరూ తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర్నుంచి తాము వేరే ఏ రూపమన్నా ధరించి ఉన్నపుడు మరణిస్తే తిరిగి బ్రతికే వరం పొందారు. అంటే రాక్షస రూపంలో కాకుండా జంతువుగానో, పక్షిగానో వాళ్ళు మరణిస్తే తిరిగి బ్రతుకుతారన్నమట.
ఆ అడవిలోకి చేరిన కొద్ది రోజుల్లోనే అడవిలో ఉన్న సాధు జంతువుల్ని, కూౄర జంతువుల్ని చంపి గుటకాయస్వాహా అనిపించేసారు. అడవిలో జంతువులన్నీ అయిపోవటంతో వాళ్ళకి తిండి సమస్య ఏర్పడింది. రెండు రోజులు గడిచే సరికి ఆకలితో నీరసం కూడా ముంచుకొచ్చేసింది.
ఒకరోజు “అన్నయ్యా! ఇలాగే ఉంటే మనం ఈ ఆకలితో చచ్చిపోతాం. ఈ అడవిలో ఒక్క జంతువు కూడా లేదు. మనం మరొక అడవికి పోదాం" అన్నాడు చిన్నవాడు.
“నిజమే కానీ ఈ చుట్టు ప్రక్కల అడవి ఏదీ లేదు. ఒకపని చేద్దాం. ఈ అడవి బాట వెంట మనుషులు పొతుండటం చూసాను. మనం వాళ్ళని తిందాం. మనిషి మాంసం భలే రుచిగా ఉంటుంది”
ఆ మాటలకి చిన్నవాడికి నోట్లో నీళ్ళూరాయి. వెంటనే వాడికి ఓ సందేహం కూడా వచ్చింది.
"అది మాత్రం ఎన్నాళ్ళు. మనం వాళ్ళని తినటం మొదలు పెడితే అడవిలో రాక్షసులున్నారని అందరికీ తెలిసిపోతుంది. ఈ దారి వెంట రావటం మానేస్తారు. అప్పుడైనా మనం ఆకలికి మాడి చావవలసిందే కదా!” అంటూ తన సందేహం బయట పెట్టాడు.
"అది నిజమే కానీ బ్రహ్మదేవుడు దగ్గర మనం పొందిన వరం ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది.” "Der?"
"ఏముంది! కామరూప విద్య చేత నువ్వు మేకగా మారు. దారినపోయే వారందరిని పిలిచి నేను నిన్ను చంపి వండిపెడతాను. వాళ్ళు తిన్నాక నువ్వు వాళ్ళపొట్టను చీల్చుకుని బయటకురా! అప్పుడు మనం వాళ్ళని వండుకు తిందాం” అంటూ చెప్పాడు అన్నయ్య.
ఇదేదో బాగుంది అనుకున్నాడు చిన్నవాడుమరుక్షణం
పెద్దవాడు అందమైన యువకుడిగానూ, చిన్నవాడు బలిష్టమైన మేకపోతుగాను మారిపోయి కాలిబాట ప్రక్కన బాటసారుల కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు.
కొంతసేపటికి ఆ దారి వెంట మునీశ్వరుడి దగ్గరకు వెడుతున్న కొంత మంది వ్యక్తులు వచ్చారు.
పెద్దవాడు వాళ్ళందరిని పలకరించి....
"అయ్యా! నాకు మగ బిడ్డ పుడితే ఈ మేకపోతును పదిమంది బాటసారులకు వండిపెడతానని మ్రొక్కుకున్నాను. కనుక నా ఆతిథ్యం స్వీకరించి నేను మ్రొక్కు చెల్లించుకోవటానికి సహకరించండి” అంటూ ఆ బాటసారుల్ని ప్రాధేయ పడ్డాడు.
మేకపోతును చూడగానే అందరికి నోరూరింది.
సరేనన్నారు
కొద్ది సేపట్లో మేకపోతు మాంసంతో వంటచేసి వారందరికి అక్కడే ఉన్న పెద్ద రావి చెట్టు క్రింద భోజనాలను పెట్టాడు.
వాళ్ళందరూ తృప్తిగా భోంచేసి “అన్నదాత సుఖీభవ” అంటూ పెద్దవాడ్ని ఆశీర్వదించి ముందుకు కదిలారు.
పెద్దవాడు వెంటనే “తమ్ముడు బయటకురా” అంటూ అరిచాడు. మరుక్షణం
ఆ బాటసారుల పొట్టలు చీల్చుకుని వాళ్ళు తిన్న మేక మాంసం ఖండాలు బయట పడి క్షణాల్లో అవి అన్నీ మేకగా మారిపోయాయి. ఆ తర్వాత ఆ మేక రాక్షసుడిగా మారిపోయింది.
ఆ అన్న తమ్ములిద్దరూ అప్పటికప్పుడు ఆ బాటసారుల్ని వండుకుని తినేసారు. ఇలా ఆ రాక్షసులిద్దరు ఆ అడవిలో బాటసారుల్ని ఏమార్చి చంపి వండుకు తినసాగారు.
ఇదిలా ఉండగా గంగాతీరంలో మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళిన వారెవరూ ప్రాణాల్తో తిరిగి రావట్లేదని మునీశ్వరుడే వాళ్ళందరినీ మాయం చెయ్యటమో లేదా వాళ్ళని చంపి వండుకుతింటున్నాడనో పుకారు ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో వ్యాపించింది. దానితో ఆయన దగ్గరకు వెళ్ళటం మానుకోవటమే కాక ఆ విషయం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆనందవర్మకు విన్నవించారు.
ఈ విషయం తేల్చుకురమ్మని మహారాజు కొంతమంది భటులను గంగాతీరానికి పంపాడు. ఆ భటులను కూడా ఏమార్చి రాక్షసులిద్దరూ అడవిలోనే వారిని గుటకాయస్వాహా చేసారు.
ముని దగ్గరకు తను పంపిన భటులు తిరిగి రాకపోవటంతో ఆ మునే మనుషులని మాయం చేస్తున్నాడని ఆనందవర్మకు నమ్మకం కుదిరింది.
వెంటనే అప్పటి కప్పుడు ఆ మునిని బంధించి తీసుకురమ్మని ఒక పెద్ద సైనిక పటాలాన్ని పంపాడు-
ఆ సమయంలో కడుపు నిండిన ఆ రాక్షసులిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. అందువల్ల ఆ పటాలం క్షేమంగా అడవి దాటి ముని దగ్గరకు చేరింది-
సైన్యాధిపతి రాజు మునిని బంధించి తెమ్మన్న విషయం చెప్పేసరికి ముని ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఆ విషయం చెప్పాడు.
"అయ్యా! మీరు చెప్పింది నిజమైతే మేం క్షేమంగానే అడవి దాటి వచ్చాం కదా... మరి మాకు ఆ యువకుడు, మేక తారసపడలేదే?” అంటూ సందేహం వెలిబుచ్చాడు-
“సరే! ఈ నాటికిక్కడ విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మీ వెంట వస్తాను. దారిలోనే ఆ రాక్షసు లిద్దరు తారస పడతారు”
సైన్యాధిపతికి ముని మాటల మీద నమ్మకం కుదరలేదు. రాత్రికి ముని రాక్షస రూపం ధరించి తమని విరుచుకుతింటాడేమోనని భయపడ్డాడు. ముని అతనికి ధైర్యం చెప్పి మంచి మాటలతో అనునయించాడు.
మర్నాడు ఉదయం ఆ సైనికుల వెంట ముని బయలు దేరాడు. దారిలో యువకుడు, మేక రూపంలో ఉన్న రాక్షసులిద్దరూ తారస పడ్డారు. ఎప్పటిలానే తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు పెద్దవాడు.
సరే నేను భీముడి అంశ కల్గినవాడ్ని ముందుగా నాకు తృప్తిగా
పెట్టి తర్వాత మిగిలినది వారికి పెట్టాలి అంటూ ముని షరతు పెట్టాడుసరేనంటూ అప్పటకప్పుడు మేకను చంపి వండి మునికి వడ్డించాడు. వండినది మొత్తం తినేసి నాకు చాలలేదు ఇంకా కావాలి అన్నాడు.
రాక్షసుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు –
“నాకు ఆకలిగా ఉంది నిన్ను కూడా తినేస్తా” అన్నాడు ముని నోరు పెద్దది చేస్తూ-
ఆ మాటలకి రాక్షసుడు భయపడి పోయి ఎవరో తమకంటే పెద్ద రాక్షసుడు వచ్చాడనుకుని 'తమ్ముడు' అంటూ గావుకేక పెట్టాడు-
అప్పటికే మునీశ్వరుడు “వాతాపి జీర్ణం” అంటూ మంత్రం చదవటం వల్ల చిన్న రాక్షసుడు ఆయన పొట్టలో జీర్ణమైపోయాడు. మరోసారి పిల్చినా తమ్ముడు రాకపోవటంతో దెబ్బకి పెద్దవాడు రాక్షస రూపం ధరించి ఆ అడవి వదిలి ఎటో పారిపోయాడు.
జరిగిందంతా సైన్యాధిపతి ద్వారా తెలుసుకున్న ఆనందవర్మ మునిని క్షమార్పణలు కోరి సముచిత రీతిలో సత్కరించాడు.