ఒక ఊళ్ళో ఒక చాకలి ఉండేవాడు-
అతడి దగ్గర ఒక గాడిద, కుక్క ఉండేవి-
గాడిద చేత బట్టల మూటను మోయించేవాడు, కుక్కను రాత్రిపుట గస్తీకి వదిలేవాడు-
పాపం! గాడిద బండ చాకిరి చేసేది-
కుక్క మాత్రం మహా బద్దకస్థురాలు. పగలు, రాత్రి తిని శుభ్రంగా గుర్రుపెట్టి మరీ నిద్దుర పోయేది-
తను మాత్రం బండ చాకిరీ చెయ్యటం కుక్క మాత్రం తిని సుఖంగా నిద్దుర పోతుండటం చూసి అదంటే గాడిదకు కడుపు మంటగా ఉంటూ
ఉండేది. 'వీలు చిక్కినపుడల్లా రాత్రి పూట నువ్వు గస్తీ కాయకుండా నిద్దరపోతున్నావని యజమానికి చెబుతాను' అంటూ కుక్కను బెదిరించేది.
అది బెదిరించినపుడల్లా "దేవుడు నిన్ను బండచాకిరీ చెయ్యటానికే పుట్టించాడు. నన్ను గస్తీ కాయటానికి పుట్టించాడు. అయినా గస్తీ కాయటం అంటే నువ్వు మూటలు మోసినంత తేలికకాదు" అంటూ దానిని హేళన చేస్తుండేది.
ఒకనాడు ఆ రెండింటి మధ్య తీవ్రవాదన జరిగింది-
గాడిదకు ఒళ్ళు మండిపోయింది -
"ఏంటి? బోడి గస్తీ. నేను తలుచుకుంటే నీకులాగా రాత్రంతా గస్తీ కాయగలను. కానీ నువ్వు తల్లక్రిందులుగా తపస్సు చేసినా నాకులాగా మూటలు మోయ్యలేవు” అంటూ కుక్కతో వాదనకు దిగింది-
“నువ్వన్నది నిజమే కావచ్చు కానీ నేను నిద్దరపోతున్నా వచ్చిన దొంగలు నన్ను చూస్తే చాలు భయపడతారు.
కానీ నువ్వు మేలుకుని ఉన్నా నిన్ను చూసి ఎవ్వరూ భయపడరు" అంటూ రెట్టించింది-
“సరే... అదీ చూద్దాం” అంటూ సవాలు చేసింది గాడిద“వద్దు మిత్రమా! నీ సవాలుకు భంగపాటు తప్పదు” అంటూ వారించే
ప్రయత్నం చేసింది కుక్క. అయినా గాడిద దాని మాటలు విన్పించుకోలేదు-
"ఈ రాత్రికే నేను గస్తీ కాస్తాను” అంది మొండిగా- 'సరే’ నంది కుక్క-
ఆ రాత్రి గాడిద గస్తీ కాయసాగింది. కుక్క గాడిద పడుకునే గొడ్లసావిట్లో పడుకుంది. అర్థరాత్రి వేళ ఇద్దరు దొంగలు వచ్చారు-
ఇద్దర్నీ గాడిద చూసింది-
వాళ్ళిద్దరూ గాడిదను చూసి ఏ మాత్రం భయపడకుండా నెమ్మదిగా ఇంటి వెనుక వైపు వెళ్ళసాగారు-
దొంగలు తనని చూసి ఏ మాత్రం భయపడకపోవటం గాడిదకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఏం చెయ్యాలో దానికి అర్థం కాలేదు-
ఆ సమయలో కుక్క ఏం చేస్తుందా అని గుర్తుకు తెచ్చుకుంది-
కుక్క మొరుగుతుంది.....
అప్పుడు యజమాని లేచి బయటకు వస్తాడు. కనుక తను కూడా మొరగాలని అనుకుని పెద్దగా ఓండ్రు పెట్టింది-
గాడిద ఓండ్రుకి యజమాని లేచి చిరాగ్గా బయటకు వచ్చేసరికి దొంగలు కటికచీకట్లోకి తప్పుకున్నారు -
యజమానికి గాడిద ఎందుకు ఓండ్రు పెట్టిందో అర్థంకాక దాన్ని ఒకసారి అదిలించి లోపలకు వెళ్ళిపోయాడు-
కొంతసేపటికి దొంగలు మళ్ళీ వచ్చారుమరోసారి గాడిద పెద్దగా ఓండ్రు పెట్టింది-
ఈసారి బయటకు వచ్చిన యజమాని తన నిద్ర పాడుచేస్తోందని దాన్ని దుడ్డుకర్రతో చావబాది లోపలకు వెళ్ళిపోయాడు-
గాడిద పాపం కుయ్యో, మొర్రో అంటూ ముల్గుతూ కుక్క దగ్గరకు చేరింది. దానిని కుక్క ఓదారుస్తూ....
"బాధపడకు మిత్రమా నీకు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను హెచ్చరించాను. అయినా నువ్వు నా మాట పెడచెవిన పెట్టావు” అంటూనే గాడిదను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది
తమని చూసి ఓండ్రు పెట్టిన గాడిదను ఆ ఇంటి యజమాని చావబాదటం చూసిన దొంగలకు ధైర్యం వచ్చింది. ఈసారి నిర్భయంగా చీకట్లోంచి బయటకు వచ్చి తాపీగా గుమ్మం ముందు నిలబడి ఎలా ఇంట్లోకి ప్రవేశించాలా? అని పరీక్షించసాగారు-
దూరం నుంచి వాళ్ళ వాసన పసి కట్టిన కుక్క గయ్యిమంటూ వాళ్ళ మీదకు విరుచుకు పడి వాళ్ళిద్దరిని కదలకుండా నిలబెట్టేసింది-
కుక్క అరుపులకు చప్పున తలుపు తీసుకుని వచ్చాడు ఆ ఇంటి యజమాని. దొంగలిద్దర్ని చూస్తూనే దుడ్డుకర్ర తీసుకుని వాళ్ళకి దేహశుద్ధి చేసాడు.
అందుకే అంటారు పెద్దలు కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని-