కొత్త దెయ్యం | Moral Stories in Telugu

 అడవి దారిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది -


ఆ చెట్టు మీద ఎంతో కాలంగా కొన్ని దెయ్యాల గుంపు నివాసం


ఉంటూ ఆ దారిన పోయే బాటసారుల్ని రక, రకాలుగా హింసించేవిఒకనాడు ఎక్కడ్నుండో ఓ దెయ్యం వచ్చి ఆ చెట్టు పైకి చేరింది కొత్త దెయ్యానికి పాత దెయ్యాలు బాటసారుల్ని హింసించటం నచ్చలేదు. అందుకని మిగతా దెయ్యాలతో “మనమూ కొంతకాలం క్రితం


మనుషులమేగా బ్రతకటానికి ఎన్నో బాధలను పడ్డవాళ్ళమేగా అన్నీ తెలిసి మనం ఇలా వాళ్ళని హింసించటం న్యాయంకాదు” అంది -


అందుకు మిగతా దెయ్యాలు “భలే నీతులు చెబుతున్నావే. మనుషులుగా ఉన్నప్పుడు మన బుద్ధులు మనకి తెలియవా? అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర చెప్పినట్లు మన బుద్ధులు మనం చెప్పుకోవాలా? ఉన్న జన్మలన్నింటిలో నీచమయినది మానవ జన్మ. ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేస్తేనే మనిషిగా పుడతారు. అటువంటి నీచ జన్మవారిని హింసించటం తప్పుకాదు” అంటూ కొత్త దెయ్యాన్ని హేళన చేసాయి -


"కాదు. ఎంతో ఉత్తమమైనది మానవ జన్మ. ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ మనుషులుగా పుట్టరు. అటువంటి వారిని ఊరికనే సరదా కోసం హింసించటం మనం మరింత పాపాన్ని మూట కట్టుకోవటమే” అంటూ ఆ దెయ్యాలతో వాదనకు దిగింది కొత్త దెయ్యం. “అవునా... పరోపకార బుద్ధి లేని స్వార్ధపరులు ఈ మనుషులు. వారికి ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చెయ్యటమే వారినైజం. అటువంటి వారిని వెనకేసుకు వస్తున్నావంటే నీవు దెయ్యం జాతికే అవమానం. తక్షణం ఇక్కడ్నుంచి అవతలకు పో...” అంటూ కొత్త దెయ్యాన్ని మిగతా దెయ్యాలన్నీ కలిసి గెంటెయ్యాలని ప్రయత్నించాయి-


కొత్త దెయ్యం ఏ మాత్రం కంగారు పడకుండా "మిత్రులారా! తొందరపడకండి ప్రతి జాతిలోను మంచివారు, చెడ్డవారు ఇద్దరూ ఉంటారు. మనం తరచి చూస్తే చెడ్డవారిలో కొన్ని మంచి లక్షణాలు, మంచివారిలో కొన్ని చెడ్డ లక్షణాలు కన్పిస్తాయి. మనం మంచిని చూస్తే మంచి, చెడును చూస్తే చెడు మనకి కన్పిస్తుంది. అందుకనే నా మాట వినండి మనుషులను హింసించటం మానుకోండి" అంది -


కొత్త దెయ్యం మాటలకు మిగిలిన దెయ్యాలకు కనువిప్పు కలిగింది. ఆనాటి నుండి బాటసారులను హింసించటం మానుకున్నాయి.


కొత్త దెయ్యం చెప్పినట్లు లోకాన్ని మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది. చెడును వదిలేసి మంచినే చూడటం మన చేతుల్లోనే ఉంది.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్