లంకె బిందెలు | Moral Stories in Telugu

గోపాల పురంలో రాఘవుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు పరమ సోమరిపోతు. తింటానికి తిమ్మరాజు పనికి పోతురాజు. పొద్దస్తమానం స్నేహితుల్తో కలిసి తిరుగుతుండేవాడు. కానీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు.


చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో తండ్రి ఎంతో గారాబంగా పెంచాడు. అందువల్లనే వాడు ఎందుకు కొరగాకుండా పోయాడు.


వృద్ధాప్యం మీద పడుతున్న రాఘవ తండ్రి కొడుకు తీరుకు మనోవ్యాధికి గురయ్యి మంచం పట్టాడు.


ఒకనాడు రాఘవను పిలిచి ఈ విధంగా చెప్పాడు-


“నాయనా! తల్లి లేని పిల్లాడివని నిన్ను గారాబంగా పెంచాను. అందువల్ల నువ్వు బాధ్యతలు తెలియకుండా పెరిగావు. నేను మరెంత కాలమో బ్రతకను. ఇంత కాలం నీకు సంపాదించటమే తెలియలేదు. అందుకని నేను సంపాదించిన సొత్తునంతా లంకెబిందెల్లో జాగ్రత్త చేసి మన పొలంలో దాచాను.


వాటిని తవ్వి తీసుకుని అవసరాలకు జాగ్రత్తగా వాడుకో. మరొక ముఖ్య విషయం ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. ఎందుకంటే భూమిలో ఎక్కడ ఏది దొరికినా అది రాజుకు చెందుతుంది. స్వయంగా నువ్యొక్కడివే వ్యవసాయం చేస్తున్నట్లు పొలం దున్ని వాటిని సొంతం చేసుకో...” అని కన్ను మూసాడు.


రాఘవుడికి ఆనందం వేసింది-


తండ్రి కర్మకాండలన్ని పూర్తయ్యేంత వరకు ఎలాగోలా ఓపిక పట్టాడు. ఆ మర్నాడే ఎడ్లను, నాగలిని తీసుకుని పొలానికి బయలు దేరాడు.


తండ్రి బ్రతికున్నంత కాలం ఏ పని చెయ్యకుండా తిరిగిన రాఘవుడు తండ్రి చనిపోగానే కాడెడ్లను కట్టుకుని పొలానికి వెళ్ళటం చూసిన ఇరుగు-పొరుగు వారు అతనిలో కలిగిన మార్పుకు ఎంతో సంతోషించారు.


రాఘవుడు సూర్యాస్తమయం వరకు నాగలితో పొలాన్ని ఆపకుండా దున్నాడు. కానీ ఎక్కడా వాడికి లంకె బిందెలు నాగలికి తగిలినట్లు అన్పించనేలేదు. దానితో వాడికి నిరాశ వచ్చేసింది.


ఎడ్లను తోలుకుని ఇంటికి వచ్చి తండ్రి పొలంలో లంకె బిందెలు దాచిన చోటు గుర్తు ఏమన్నా వదిలాడేమోనని భోషాణం తెరిచాడు. అందులో పంటవెయ్యటానికి పనికి వచ్చే కూరగాయల గింజల పొట్లాలు తప్ప మరేంవాడికి కన్పించలేదు.


మర్నాడు మళ్ళీ పొలం దున్ని చూడాలి అనుకుని ఆ రాత్రి నిద్దుర పోయాడు-


వాడు నిద్ర పోయాక జోరున వాన కురిసింది-


రాఘవుడి పొలంలో నీరు నిండి దమ్ము పట్టింది-


ఆ బురదలో దున్నటం ఇష్టం లేక రాఘవుడు ఇంటి దగ్గరే ఉండి పోయాడు.


ఆ సాయంత్రం వాడి తండ్రి స్నేహితుడు వచ్చి నువ్వు “ఏ ముహూర్తాన నాగలి పట్టుకున్నావో గానీ మూడేళ్ళుగా రాని వర్షం వచ్చేసింది. నీ పొలం చక్కగా నానింది. దాన్ని వృధాగా వదిలెయ్యకుండా వరి నాట్లు వెయ్యి" అంటూ సలహా ఇచ్చాడు.


రాఘవుడు ఏ కళనున్నాడో “సరే” అన్నాడు.


మర్నాడు వెళ్ళి నాట్లు వేసాడు-


ఆ రోజు మొదలు రాఘవుడు ప్రతిరోజు పొలంకి వెడుతూ పంట ఎంత త్వరగా చేతికి వస్తుందా? ఆ తర్వాత లంకెబిందెలు తవ్వి తీసుకుందామా? అని శ్రద్ధగా పంట బాగోగులు చూడసాగాడు.


ఆ ఏడు రాఘవుడి అదృష్టం కొద్ది సకాలంలో వర్షాలు కురిసాయిరాఘవుడి పొలం ఏపుగా పెరిగింది-


మునుపటి కంటే ఆ ఏడు రెట్టింపు దిగుబడి మొదలైంది -


రాఘవుడి తండ్రి స్నేహితుడు ఒకనాడు అతడి ఇంటికి వచ్చి “రాఘవా! నీ చేతుల్లో ఏదో మహత్తు ఉందిరా ఇంతకు ముందెప్పుడు మీ నాన్న కానీ నేను కానీ ఇంత దిగుబడిని సాధించలేదు. నీకభ్యంతరం లేకపోతే నీకు మా అమ్మాయినిచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను” అన్నాడు. అప్పటికి రాఘవుడి మనసు లంకెబిందెల మీదే ఉంది.


అన్నాడు. “ఇప్పుడే కాదు మరికొంత కాలం ఆగాక నా నిర్ణయం చెప్తాను”


లంకె బిందెలు దొరికితే గొప్ప ధనవంతుడైపోతాడు. అప్పుడు గొప్ప సంబంధం వస్తుందని వాడి ఉద్దేశం-


వాడి ఉద్దేశం గ్రహించి "రాఘవా! నీ మనసు ఇంకా మీ నాన్న చెప్పిన ఆ లంకె బిందెల మీదే ఉన్నట్లుంది. నిజంగా నీ పొలంలో ఏ లంకెబిందెలు లేవు. నిన్ను మార్చటానికి మీ నాన్నకు నేనే ఆ సలహా ఇచ్చాను. మీ నాన్న చెప్పిన లంకెబిందెల్లో మొదటిది పొలం. రెండవది మా అమ్మాయి. నాకు ఒక్కత్తె కూతురు. నా ఆస్తి మొత్తం దానికే. ఆలోచించుకో” అంటూ చెప్పాడా పెద్దమనిషి-


ఆ మాటలకి రాఘవుడికి కనువిప్పు కల్గింది -


తన తండ్రి తనని మార్చటానికే పొలంలో లంకెబిందెలున్నాయని చెప్పాడన్న నిజం గ్రహించి ఆ పెద్ద మనిషి కూతుర్ని వివాహం చేసుకుని అచిర కాలంలోనే ఆ గ్రామంలో ఆదర్శ రైతుగానే కాక ధనవంతుడిగా కూడా పేరు గడించాడు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్