ధైర్యే సాహసే లక్ష్మి | Moral Stories in Telugu

గాంధార దేశాన్ని ఆనందసాగరుడనే రాజు పాలించేవాడు. ఆయనకి మల్లిక అనే కూతురు ఉండేది.


యువరాణి అందాలరాశే కాక అన్ని విద్యల్లోనూ అందరికంటే ముందుండేది.


ఆ రాజ్యానికి పడమర వైపునున్న కొండ గుహలో ఒక దుష్టమాంత్రికు డుండేవాడు. క్షుద్రశక్తుల కోసం అతడు పుష్కరకాలంగా ఒక వ్రతం చేస్తున్నాడు. ఆఖరి రోజున రాజుకు ఏకైక సంతానంగా జన్మించిన రాచకన్యను బలిఇస్తేనే ఆ వ్రతం పూర్తయ్యి క్షుద్రదేవుడైన కాలభైరవుడు ప్రత్యక్షమయ్యి కోరిన శక్తులు ప్రసాదిస్తాడు.


మరొక రెండు రోజుల్లో వ్రతం పూర్తవుతుందనగా ఆ మాంత్రికుడు బలి ఇవ్వటానికి తగిన కన్య కోసం దుర్బిణి వేసి చూసాడు. అందులో గాంధార రాకుమార్తె మల్లిక కన్పించింది.


వెంటనే మాంత్రికుడు మాయా రూపంలో రాకుమార్తె మందిరంలోకి ప్రవేశించి ఎవ్వరూ చూడకుండా ఆమెని చిలుకను చేసి తనతో పట్టుకుపోయాడు.


కొంతసేపటికి అంతఃపురంలో రాకుమార్తె కన్పించటం లేదన్న సంగతి రాజుకు తెలిసి వెంటనే వెతకమని భటులకు పురమాయించాడు. వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరి రాజ్యమంతా వెతికి ఒట్టి చేతుల్తో తిరిగి వచ్చారు.


మంత్రి సలహాతో రాకుమార్తెను తిరిగి తెచ్చిన వారికి అర్థం రాజ్యం ఇచ్చి రాకుమార్తెను కూడా ఇచ్చి పెళ్ళి చేయిస్తానని దండోరా వేసాడు -


రాముడు అనే యువకుడు ఆ దండోరా విన్నాడు. వాడి సొంత ఊరు రామాపురం. చిన్నప్పట్నుంచి చదువు సంధ్యలు కంటే వాడికి సాహస కార్యాలంటేనే ఇష్టం. వాడు చాలాసార్లు మాంత్రికుడుంటున్న కొండ దగ్గరకి పశువులను మేపటానికి వెళ్ళేవాడు.


అప్పుడు వాడికి బలి ఇచ్చిన కోడి, మేక వంటి కళేబరాలు కన్పించేవి. అవి ఎవరో అక్కడ చంపిపడేస్తున్నారని అనుకునేవాడు. కానీ ఆ కొండ గుహలో మాంత్రికుడున్నాడని పాపం వాడికి తెలియదు కనీసం ఊహకైనా తట్టలేదు-


దండోరా విన్నాక రాముడికి కొండ దగ్గర తను చూసిన కళేబరాల విషయం గుర్తుకు వచ్చింది. అంతఃపురంలో మాయమైన రాకుమారికి ఆ కొండకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనిపించింది.


సరే! రాకుమారిని వెతకటం ఎక్కడ నుంచో ఒక చోట నుంచి మొదలు పెట్టాలి కదా! అదేదో ఆ కొండ దగ్గర నుంచే మొదలు పెడితే సరిపోతుంది కదా... అనుకుని అప్పటి కప్పుడు ఆ కొండ దగ్గరకు బయలుదేరాడు.


రాముడు అలా బయలుదేరటమే మంచి దయ్యింది. ఆ రాత్రి గడిస్తే మరుసటిరోజే మాంత్రి కుడి వ్రతం పూర్తయ్యే ఆఖరి రోజు -


రాముడు కొండకు చేరేసరికి సాయంత్ర పొద్దయ్యింది. అయినా ఏ మాత్రం భయపడకుండా జంతుకళేబరాలు గుర్తు చూసుకుంటూ తిన్నగా మాంత్రికుడి గుహ దగ్గరకు చేరాడు.


ఆ గుహకి పెద్ద బండరాయి అడ్డం ఉంది. దాన్ని ప్రక్కకు నెట్టటం రాముడికి శక్తికి మించిన పని అయ్యింది.


ఏం చెయ్యాలో పాలుపోక అలాగే నిల్చున్నాడు. ఆ సమయంలో ఆ బండరాయి పెద్ద చప్పుడుతో ప్రక్కకి జరగటంతో రాముడు చప్పున ఓ పొద ప్రక్కకి తప్పుకున్నాడు.


గుహలోంచి మాంత్రికుడు బయటకు వచ్చి ఓ మంత్రం చదివి చివరగా “మూసుకో... మూసుకో” అంటూ మూడు సార్లు అనగానే ఆ బండరాయి గుహకి అడ్డంగా మూసుకుపోయింది.


మాంత్రికుడు మంత్రం చదువుతున్నప్పుడు విన్న రాముడు ఆ మంత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మాంత్రికుడు వెళ్ళి పోయాక ఆ బండరాయి ముందుకు వచ్చి ఆ మంత్రం చదివి మూసుకో అంటే మూసుకుంది కదా తెరుచుకో మంటే తెరుచుకోవచ్చు కదాని ఆఖర్లో “తెరుచుకో... తెరుచుకో” అంటూ మూడుసార్లు అన్నాడు.


రాముడు అనుకున్నట్లే ఆ బండరాయి దారి తప్పుకుని దారి ఇచ్చింది. వాడు లోపలకు వెళ్ళగానే మళ్ళీ మంత్రం చదివి బండరాయితో గుహని మూసేసాడు. రాకుమారి కోసం తూనీగలాగా గుహంతా కలయతిరిగాడు. వాడికెక్కడా ఆమె కన్పించలేదు.


చివరికి ఒక పంజరంలో ఉన్న రామచిలుక వాడ్ని ఆకర్షించింది. పంజరం దగ్గరకు వెళ్ళి “చిలుకా... చిలుకా ఈ మాంత్రికుడు మా రాకుమారిని ఎత్తుకు వచ్చాడని నా అనుమానం. ఆమెను ఎక్కడ దాచాడో నీకు తెలిస్తే కొంచెం చెప్పు. అలా చెబితే పంజరం నుండి విముక్తి కల్గిస్తాను” అంటూ పంజరం తలుపు తెరిచాడు.


"అయ్యో! నేనే మీ రాకుమారి మల్లికను. ఈ మాంత్రికుడు నన్ను చిలుకగా మార్చాడు” అంటూ మానవ భాషలో చెబుతూ ఏడ్చింది రాకుమారి.


“అలాగా అయితే పద... మీ నాన్నగారి దగ్గరకు తీసుకు వెడతాను” అంటూ పంజరంలోంచి బయటకు తీసి ముందుకు నడిచాడు రాముడు.


“ఆగు! నువ్వు నన్ను ఈ గుహ బయటకు తీసుకు వెళ్ళిన మరుక్షణం


నేను మాములు చిలకను అయిపోతాను. నా గతం నాకు గుర్తుండదు. నేను శాశ్వతంగా మానవ రూపంలోకి రాలేను." అని అన్నది.


రాముడికి తన తప్పు అర్థమయ్యింది.


“మరి ఇప్పుడెలా?” అంటూ రాకుమారినే అడిగాడు-


“మాంత్రికుడి శిరస్సు ఖండిస్తేగానీ నాకు పూర్వరూపం రాదు. ఈ సంగతి నాతో మాంత్రికుడే స్వయంగా చెప్పాడు. ఆ కాలభైరవుడి చేతిలో ఉన్న ఖడ్గంతోనే వాడి శిరస్సు తెగుతుందట. నువ్వు ఆ ఖడ్గం తీసుకుని మాంత్రికుడు రాగానే వాడి శిరస్సు ఖండించు. నాకు విముక్తి కల్గుతుంది” అంటూ చెప్పింది రాకుమారి.


“తొందరగా ఖడ్గం తీసుకుని దాక్కొ. రేపు హోమంలో వెయ్యటానికి రావి వేరులు తేవటానికి వెళ్ళాడు. ఏ సమయంలోనైనా రావచ్చు” అంటూ రాకుమారి తొందర చెయ్యటంతో ఖడ్గం తీసుకుని ద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయికి ఒక ప్రక్క నక్కి కాచుక్కూర్చున్నాడు రాముడు.


కొంతసేపటికి మాంత్రికుడు వచ్చాడు -


వాడు గుహ లోపలకు అడుగుపెట్టటమే ఆలస్యం రాముడు కత్తితో సూటిగా వాడి మెడ మీద ఒక్కవేటు వేసాడు. అంతే మాంత్రికుడి తల ఎగ్గిరి బంతిలా అవతల పడింది-


మరుక్షణం రాకుమారికి రామచిలుక రూపం పోయి మానవ రూపం వచ్చేసింది -


రాముడు ఆమెను ఎంతో జాగ్రత్తగా కోటకు చేర్చాడు. రాజు దండోరా ప్రకారం రాముడికి అర్థరాజ్యం ఇవ్వటంతో పాటు రాకుమారిని ఇచ్చి పెళ్ళి చేసాడు.


రాముడు ఆ తర్వాత తన రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా పాలించి ప్రజల మెప్పు పొందాడు.


అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్