అక్బర్ చక్రవర్తి అభిమానాన్ని పొందడానికి ఆస్థానంలోని పలువురు ఉద్యోగులు, ప్రముఖులు ఆయన్ను తరచూ పోటీ పడి పొగుడుతూండేవారు. ఇది బీర్బల్కు వింతగా తోచి, వీళ్ళు రాజోద్యోగులా? ఆయన పెంపుడు కుక్కలా? అని ఆశ్చర్యపోయేవాడు. ఒకనాడా మాట ఉండబట్టలేక వాళ్ళ ఎదుటే అనేశాడు.
దాంతో ఆస్థానోద్యోగులకు కోపం వచ్చి, "బీర్బల్, మమ్మల్ని అలా అన్నందుకు క్షమాపణ చెప్పు. లేదా ఆ మాటను ఉపసంహరించుకో,” అన్నారు. “ఎందుకూ?” అని అడిగాడు బీర్బల్. "మేము కుక్కలు కాముగనక, అన్నారు రాజోద్యోగులు.
“అది నాకూ తెలుసు కదా!” అన్నాడు బీర్బల్.
"మరి మమ్మల్ని కుక్కలతో పోలుస్తావేందుకు?" అని నిలదీశారు రాజోద్యోగులు.
"కుక్కలకు తోక ఉంది. మీకు అది లేదు. కుక్క యజమానిని చూడగానే తోకను ఆడిస్తుంది. మీరు రాజు కనిపించగానే తెగ పొగుడుతూ నాలుకను ఆడిస్తున్నారు. అదొక్కటే తేడా. ఆయన అసంబద్ధమైన విషయం చెప్పినా 'ఆహా, ఓహో ' అని ఆకాశానికి ఎత్తుతారెందుకు?” అని అడిగాడు బీర్బల్.
"అది మా ఇష్టం. దానిని పరిహసించడానికి నువ్వెవరు? మనుషులను కుక్కలంటావా?” అన్నారు ఉద్యోగులు మరింత కోపంగా.
“మీరందరూ మనుషులే కాని వెన్నెముక మాత్రమే లేదు," అన్నాడు బీర్బల్.
“ఏమిటి నువ్వంటున్నది!” అని అడిగారు వాళ్ళు.
"మీలో ధైర్యం లేదంటున్నాను. వాస్తవం గనక అది మీకు కటువుగా కనిపిస్తున్నది. నిజం నిప్పు లాంటిది కదా,” అన్నాడు బీర్బల్
చిన్నగా నవ్వుతూ.
“మా మాట సరే. మరి నువ్వు మా కన్నా మహాధైర్య శాలివా?" అని అడిగారు ఉద్యోగులు.
“అందులో సందేహం దేనికి? ఏం చెయ్యమంటారో చెప్పండి. చేసి చూపిస్తాను," అన్నాడు బీర్బల్.
“ముందే అనుమతి יי పొందకుండా రాజసభకు, చక్రవర్తి వచ్చాక నువ్వు ఆలస్యంగా రాగలవా?" అని అడిగాడు ఒక ఉద్యోగి.
రాజు కొలువుదీరే సభకు, సభికులు చక్రవర్తికన్నా ముందుగానే రావాలన్న చట్టం అమలులో ఉండేది. ఆలస్యంగా వచ్చినా, ముందే అనుమతి పొందకుండా రాకపోయినా వారిని చక్రవర్తి కఠినంగా శిక్షించేవాడు. ఆ సంగతి ఎరిగిన బీర్బల్ తను చేయబోయే పనికి పడనున్న శిక్షను తలుచుకుని ఒక్క క్షణం భయపడ్డాడు. కాని భయపడితే సాధించేదేమీ ఉండదని గ్రహించి, శిక్ష నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తూ, “సరే, రేపు చక్రవర్తి సభకు వచ్చేప్పుడు నేను సభలో ఉండను. ముందు అనుమతి పొందకుండానే సభకు రాకుండా ఉండిపోతాను,'' అన్నాడు.
ఈ దెబ్బతో చక్రవర్తి వద్ద బీర్బల్ కు ఉన్న పలుకుబడి కాస్త ఎగిరి పోగలదని సభికులు లోలోపల ఎంతగానో సంతోషించారు.
మరునాడు చక్రవర్తి కొలువుకూటానికి వచ్చేసరికి బీర్బల్ తప్ప తక్కిన వారందరూ తమ తమ ఆసనాలలో కూర్చుని ఉన్నారు. చక్రవర్తి రాగానే అందరూ లేచి నిలబడి, ఆయనకు వంగి నమస్కరించారు.
సభను పరిశీలించి చూసిన చక్రవర్తి, “బీర్బల్ ఎక్కడ? రాలేనని ఎవరితోనైనా కబురు చేశాడా?" అని అడిగాడు.
“లేదు ప్రభూ,” అన్నాడు దానికి సంబంధించిన అధికారి.
“అనుమతి లేకుండా ఇంటి వద్ద కూర్చోవడానికి అతడికి ఎంత ధైర్యం? భటుణ్ణి పంపి వెంటనే రప్పించండి," అన్నాడు చక్రవర్తి కోపంగా.
అధికారి ఆజ్ఞతో అక్కడి నుంచి వెళ్ళిన భటుడు గంట సేపు తరవాత తిరిగి వచ్చి, "పాపాయి ఏడుపు ఆపగానే వస్తానని బీర్బల్ చెప్పమన్నాడు ప్రభూ!" అన్నాడు.
“నా ఆజ్ఞనే ధిక్కరిస్తాడా? పాపాయి ఏడుపు ఆపడం అంత కష్టమైన కార్యమా? బీర్బల్ను తెలివైనవాడనీ, ప్రతి సమస్యకూ పరిష్కారం చూపగలడనీ భావించానే!” అన్నాడు అక్బర్ ఆవేశంతో.
ఒక్క నిమిషం సభలో నిశ్శబ్దం అలముకున్నది. "బీర్బలు ఉన్నపళాన ఇక్కడికి తీసుకురండి. రానంటే కాళ్ళు చేతులు బంధించి మరీ లాక్కురండి,” అన్నాడు చక్రవర్తి.
కొంతసేపటికి అక్కడికి వచ్చిన బీర్బలు చక్రవర్తి నఖశిఖ పర్యంతం తేరిపార చూశాడు.
"ప్రభువులు క్షమించాలి. మా మూడేళ్ళ పాపాయి పొద్దుటి నుంచి ఒకటే ఏడుపు.
అందుకే రాలేక పోయాను. ఇంకా ఏడుస్తూనే ఉంది," అన్నాడు బీర్బల్.
“నీబోటి మేధావికి పాపాయిని సముదాయించడం అంత కష్టమైన పనా?" అని అడిగాడు అక్బర్ కాస్త వ్యంగ్యంగా.
బీర్బల్ ఉచ్చులో పడ్డాడని సభికులు ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకోసాగారు.
'అక్కడి పరిస్థితిని వివరిస్తే ప్రభువులకు నా సంకట స్థితి అర్థమవుతుంది,” అన్నాడు బీర్బల్ కంఠస్వరం కాస్త తగ్గించి. “చెప్పు మరి," అన్నాడు అక్బర్ ఆదుర్దాగా.
“పాపాయి చెరుకు కావాలని ఏడ్వడం మొదలు పెట్టింది. చెరుకుగడ తెప్పించి ఇచ్చాను. అయినా ఏడ్వడం మానలేదు. 'ఇంకేం కావాలి?' అని అడిగాను. చెరుకు రసం కావాలన్నది. ఎంతో కష్టపడి చెరుకు రసం తీసి లోటాలో అందించాను. లోటాను నేలకేసి విసిరికొట్టి, 'ఆ రసాన్ని లోటాలోకి తీసి ఇవ్వు,' అంటూ మరింత గట్టిగా ఏడ్వసాగింది. కింద పారబోసిన చెరుకు రసాన్ని మళ్ళీ లోటాలోకి నేనెలా తీసి ఇవ్వగలను ప్రభూ! ఇంకా ఏడుస్తూనే ఉంది. అందుకే నేను సమయానికి సభకు రాలేకపోయాను,” అన్నాడు బీర్బల్ పశ్చాత్తాపంతో.
"పసిబిడ్డ ఏడుపు మానిపించలేని వాడివి, నాకెలా సలహాదారుగా ఉండగలవు బీర్బల్?” అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా.
“పిల్లల అల్లరి అలాంటిది ప్రభూ. తమ రెప్పుడైనా ఏడ్చే పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారా ప్రభూ?" అని అడిగాడు బీర్బల్.
“లేదు," అన్నాడు అక్బర్.
“ప్రయత్నించి చూస్తే మీకే అది తెలుస్తుంది ప్రభూ," అన్నాడు బీర్బల్.
'అదెంత పని? తీసుకురా ఆ పాపాయిని," అన్నాడు అక్బర్.
"నేనే మూడేళ్ళ పాపాయిగా ఏడుస్తాను. మీరు పెద్దవారుగా నన్ను నవ్వించండి చాలు, అన్నాడు బీర్బల్.
'క్షణాల్లో నవ్వించగలను," అన్నాడు అక్బర్ ధీమాగా.
బీర్బల్ పసిబిడ్డలా నేలపై బడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుపు లంకించుకు న్నాడు. అక్బర్ లేచి, అతణ్ణి సమీపించి, “ఏడవకు పాపా, ఏడవకు. ఏం కావాలో చెప్పు, అన్నాడు
ఆప్యాయంగా. .
“నాకు బంగారు ఉంగరం కావాలి!" అన్నాడు బీర్బల్ పసిబిడ్డ కంఠస్వరంతో
అక్బర్ వేలికి ఉన్న ఉంగరం తీసి బీర్బల్ కు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న బీర్బల్ మళ్ళీ ఏడ్వడం మొదలు పెట్టాడు.
"ఉంగరం ఇచ్చాను కదా? ఇంకా ఎందుకు ఏడుస్తావు?” అన్నాడు అక్బర్.
“నాకు ఏనుగు కావాలి!" అన్నాడు బీర్బల్ ఏడుస్తూనే. అక్బర్ ఒక పిల్ల ఏనుగును తెప్పించాడు. అయినా బీర్బల్ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు.
“ఇంకా ఏం కావాలి?" అని అడిగాడు అక్బర్ కాస్త విసుగ్గా.
"ఏనుగును ఆ ఉంగరం గుండా పోయేలా చేయాలి!' అంటూ బీర్బల్ మళ్ళీ ఏడ్వ సాగాడు.
"అసాధ్యం!” అన్నాడు అక్బర్ కోపంగా. “కింద పోసిన చెరుకు రసాన్ని లోటాలో నింపడం కూడా అసాధ్యం ప్రభూ, అంటూ బీర్బల్ లేచి నిలబడ్డాడు చిన్నగా నవ్వుతూ. అక్బర్ చక్రవర్తి కూడా నవ్వుతూ, “అవును బీర్బల్. పసిబిడ్డను ఓదార్చడం చాలా కష్టమైన పనే. నువ్వు రాకపోవడానికి కారణం ఇప్పుడర్థమయింది," అంటూ వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు.
తనను సవాలు చేసిన ఆస్థానోద్యోగుల కేసి బీర్బల్ ఒకసారి చూశాడు. బీర్బలు ఇబ్బందికి గురిచెయ్యాలనుకున్న వాళ్ళు సిగ్గుతో తలలు వంచుకున్నారు.