అనగనగా ఒక రాజు గారు -
ఆయనకి అయిదుగురు కొడుకులు-
అయిదుగురూ అయిదు విద్యల్లో ప్రావీణ్యలు -
పెద్దవాడు కత్తి యుద్ధంలో వీరుడు -
రెండవవాడు మల్ల యుద్ధంలో మొనగాడు–
మూడొవవాడు విలు విద్యలో ప్రావీణ్యుడు -
నాలుగవవాడు గుర్రపుస్వారీలో దిట్ట -
అయిదవవాడు తంత్రవిద్యలో జ్ఞాని-
అవటానికి అన్నదమ్ములే అయినా వాళ్ళలో ఐకమత్యం లేదు. కొడుకుల శక్తి యుక్తులకు ఎంతో సంతోషించే మహారాజుకు వారందరి మధ్య ఐకమత్యం లేకపోవటం ఎంతో విచారాన్ని కల్గించింది-
అయిదుగురు కొడుకులను దగ్గర కూర్చోపెట్టుకుని ఎన్నో సార్లు ఐకమత్యమే మహాబలం అంటూ ఎన్నో కథలు ఉదాహరణలుగా చెప్పాడు. అయినా వారిలో మార్పులేదు. ఎవరికి వారు తాము నేర్చుకున్న విద్యే గొప్ప అని గర్వానికి పోయి తక్కిన వారిపట్ల చులకన భావం కనబరిచారు.
రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు –
ఒకనాడు మంత్రిని పిలిచి తన మనోవ్యధను చెప్పాడు.
మంత్రి రాజుతో "రాజా! బాధపడకండి. త్వరలోనే యువరాజులందరి మధ్యన ఐకమత్యం ఏర్పడే విధంగా నేనొక ఎత్తు వేస్తాను. నాకు కొంత సమయం ఇప్పించండి” అన్నాడు.
రాజు సరేనన్నాడు-
కొద్ది రోజులకు మంత్రి ఓ పధకం పన్ని ముందుగా మహారాజుతో తన పధకం చర్చించి అందుకు ఆయన అంగీకారం పొంది మరునాటి రాత్రి దానికి ముహూర్తం నిర్ణయించాడు.
ఆ మంత్రి కుమారుడు సకల క్షత్రియ విద్యల్లోనూ పారంగతుడు. శక్తి యుక్తుల్లో యువరాజుల కంటే సమర్థుడు. అతడిని చూసుకునే మంత్రి ఆ పధకం రచించాడు.
మరునాటి రాత్రి-
మహారాజు అంతఃపురంలోకి దొంగతనంగా ఓ ముసుగు వీరుడు ప్రవేశించాడు. అతడు సూటిగా పోయి మహారాజును బంధించి అట్టొచ్చిన సైనికులను కరవాలంతో చెల్లాచెదురు చేస్తూ మహారాజును గుర్రం పైన ఎత్తుకు పోతూ “మీ మహారాజు మీకు కావాలంటే మీ యువరాజులందరిని రేపు కొండవాగు ప్రక్కనున్న మైదానంలో నాతో యుద్ధం చేసి గెలవమనండి” అంటూ వాయువేగంతో మాయమైపోయాడు.
రాజును ముసుగు వీరుడు బంధించి తీసుకుపోయిన విషయం యువరాజులకు తెలిసింది. ఆ వీరుడు చెప్పినట్లే మర్నాడు అతనితో యుద్ధానికి సిద్ధమయ్యి అప్పటి కప్పుడు బయలుదేరి కొండవాగు దగ్గరకు చేరుకున్నారు.
సూర్యోదయం అయిన కొంతసేపటికి ముసుగు వీరుడు అక్కడకు వచ్చాడు.
యువరాజుల వెంట వచ్చిన సైన్యం అతన్ని బంధించటానికి ప్రయత్నంచగా ఆ వీరుడు ఇలా చెప్పాడు.
"సైనికులారా! నన్ను బంధించి చిత్రహింసలు పెట్టినా ప్రాణాలయినా విడుస్తాను. కానీ మహారాజు ఆచూకీ చెప్పను. సూర్యాస్థమయంలోపు ఈ యువరాజులు అయిదుగురు వారి వారి విద్యల్తో నన్ను గెలిస్తేనే మహారాజు విముక్తుడవుతాడు. ఏ ఒక్కరు నాతో ఓడిపోయినా మహారాజు మీకు దక్కడు. ప్రాణాల మీద ఆశను వదులుకునే ఇక్కడకు వచ్చాను” ఆ మాటలు విన్న యువరాజులకు పౌరుషం ముంచుకొచ్చి సైనికుల్ని ఆపి తామే రంగంలోకి దిగారు.
మొదట పెద్దవాడిని కత్తి యుద్ధనికి ఆహ్వానించాడు ముసుగు వీరుడు. ఇద్దరి మధ్యా భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముసుగు వీరుడే గెలిచాడు.
రెండోవాడితో మల్ల యుద్ధంలోను, మూడో వాడితో విలు విద్యలోను, నాల్గవవాడితో గుర్రపు స్వారీలోను గెలిచాడు ముసుగు వీరుడు.
ఆఖరుగా అయిదవవాడు వాడిని పిలిచి నీ అన్నలు నాతో యుద్ధం చెయ్యకుండా నీ తండ్రిని కాపాడటానికి తగిన తంత్రమును రచించలేకపోయరు. ఇంక నువ్వేం మొనగాడివి. అంతఃపురంలో ఉన్న నీ తండ్రిని ఒంటరిగా వచ్చి ఎత్తుకు పోయిన నేనే నీకంటే గొప్పతంత్రం రచించగలవాడిని కనుక నువ్వు కూడా నా ముందు ఓడిపోయినట్లే, అంటూ హేళన చేసాడు.
అప్పుడు ఆ వీరుడు ముసుగు తియ్యటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అతడు మంత్రి కుమారుడు. అతడు ఈ విధంగా చెప్పాడు “యువరాజులారా! తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు. మీ అయిదుగురూ సమర్థులే కానీ ఎవరికి వారు నేను గొప్పంటే నేనే గొప్పని అహంకారంతో విర్రవీగుతున్నారు.
నేను మీతో ఒక్కొక్కరితో యుద్ధం చేసాను కనుక గెలిచాను. అదే మీ అయిదుగురితో ఒకేసారి యుద్ధం చెయ్యాల్సి వస్తే గెలవలేను. అదే ఐకమత్య బలం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియ చెప్పటానికి మా తండ్రి మీ తండ్రి కలిసి నాతో ఇంత కథను నడిపించారు.” ఆ మాటలు విన్న యువరాజులకు జ్ఞానోదయమయ్యింది. ఆ క్షణం నుండి అహంకారం విడిచి అందరం ఐకమత్యంగా ఉంటామని మంత్రి కుమారుడికి మాట ఇస్తూ అతడే తమ తండ్రి తర్వాత తాము రాజ్యానికి వచ్చినపుడు మంత్రిగా ఉండాలని కోరారు.
ఐకమత్యాన్ని మించిన బలంలేదు. కొన్ని గడ్డి పరకలను కలిపి మోకుగా తయారు చేస్తే అది ఏనుగునయినా బంధిస్తుంది.